అమరావతి ఎల్పీఎస్ భేష్
- ఇంత భారీ ఎత్తున... అదీ శాంతియుతంగా జరగడం ప్రపంచంలోనే టాప్
- న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయస్థాయి సదస్సులో సీఆర్డీయే కమిషనర్ లక్ష్మీ నరసింహం
- జాతీయ స్థాయి ఎల్పీఎస్ రూపకల్పనలో భాగంగా.. 'తెరి' సదస్సులో ప్రసంగం
అమరావతి: రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం- ఎల్పీఎస్) ఉత్తమమైనదని ఏపీసీఆర్డీయే కమిషనర్ డాక్టర్ పి.లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు. అమరావతి కోసం భూములను పూలింగ్ ప్రాతిపదికన ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినంతనే రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు సుమారు 34,000 ఎకరాలను అందించడం చారిత్రాత్మకమన్నారు. ఇంతటి భారీ ప్రక్రియ, అదీ పూర్తి శాంతియుతంగా జరగడం దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలోనే మరెక్కడా జరిగి ఉండకపోవచ్చునని చెప్పారు. రాజధాని కోసం చేపట్టిన పూలింగ్ ప్రక్రియలో పలు అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని, దళిత, బలహీన వర్గాల రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రులతోపాటు అధికార పక్షమైన వైసీపీకి చెందిన పలువురు నేతలు ఆరోపణలు సంధిస్తున్న సమయంలో లక్ష్మీ నరసింహం ఆ పథకంపై పై విధంగా స్పందించడం విశేషం. ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భూసమీకరణపై న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన అమరావతి ఎల్పీఎస్ పథకం విజయవంతమైన క్రమం సోదాహరణంగా వివరించారు. పలువురు నిపుణులు, సభికులు ఈ పథకంపై లేవనెత్తిన సందేహాలు, అనుమానాలను సంపూర్ణంగా నివృత్తి చేశారు. రాజధాని గ్రామాల్లోని రైతుల కోసం అమలు పరిచిన ఎల్పీఎస్ ప్యాకేజీ వివరాలతోపాటు నిరుపేదలు, ఇతర వర్గాలకు వర్తింపజేసిన సంక్షేమ పథకాలు, భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను ఎటువంటి ఆరోపణలకు ఆస్కారమివ్వని రీతిలో ఆన్‌లైన్ లాటరీ ద్వారా కేటాయించిన వైనాన్ని తెలిపారు. దేశంలోని కొన్ని చోట్ల ఎల్పీఎస్ అమలు చేసే క్రమంలో తలెత్తిన అవాంఛనీయ సంఘటనలు, ప్రతికూలత వంటివేమీ అమరావతిలో జరగకపోవడమే ఈ పథకం ఇక్కడ ఎంత విజయవంతమైందీ, అన్ని వర్గాల వారిని ఎంతలా సంతృప్తి పరచిందీ అనేదానికి నిదర్శనాలుగా అభివర్ణించారు.
జాతీయ స్థాయి ఎల్పీఎస్ రూపకల్పనలో భాగంగా..
గత కొంతకాలంగా దేశంలో మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక వాడలు, గ్రీన్ ఫీల్డ్స్ నగరాలు, విమానాశ్రయాలు తదితరాలను పెద్దఎత్తున చేపట్టడానికి, ఇప్పటికే ఉన్న నగరాలు, పట్టణాల విస్తరణకు జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలిసిందే. ఆయా పథకాలు సజావుగా, సకాలంలో పట్టాలెక్కాలంటే వాటికి అవసరమైన భూమిని ఎంత త్వరగా వీలైతే అంత శీఘ్రంగా, పైగా ఎటువంటి వివాదాల్లేకుండా సమకూర్చాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది.
ఈ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా మరిన్ని భారీ స్థాయి మౌలిక వసతుల పథకాలను చేపట్టి, ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగు పరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 'జాతీయస్థాయి భూసమీకరణ విధానాన్ని' రూపొందించాలని నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి తోడ్పడే సలహాలు, సూచనలు అందించేందుకు 'తెరి' (ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) గత శుక్ర, శనివారాల్లో న్యూఢిల్లీలో ఒక అంతర్జాతీయస్థాయి సదస్సును నిర్వహించింది. కేవలం విజయవంతంగా భూమిని సమీకరించడంపైనే దృష్టిని కేంద్రీకరించకుండా, సదరు భూమిని పూలింగ్ కింద ఇచ్చిన రైతుల జీవనోపాధి పరిరక్షణ, ఆ ప్రాంతాల్లోని ఇతర వర్గాలపై ఆ ప్రభావం అంతగా లేకుండా చూడడంతోపాటు సంబంధిత ప్రాజెక్టులతో వారికి సైతం గరిష్ట లబ్ధి చేకూరేలా చూడడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు. అదే సమయంలో వాటిని సాధించడంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమించడం ఎలా అనేదీ దీని చర్చాంశాల్లో ఒకటి.
రాష్ట్ర, జాతీయస్థాయి ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, ద్రవ్య సంస్థల ప్రతినిధులు, కన్సల్టెంట్లు, సామాజికవేత్తలు, పరిశోధకులు తదితరులు హాజరైన ఈ సదస్సులో రాష్ట్రం తరపున సీఆర్డీయే కమిషనర్ డాక్టర్ పి.లక్ష్మీ నరసింహం, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.